: ఉగ్రవాదుల కోసం ప్రత్యేకంగా యాప్ రూపొందించిన ఇస్లామిక్ స్టేట్.. ఎన్ఐఏ విచారణలో వెలుగు చూసిన వాస్తవం!
ఉగ్రవాదుల గోప్యత, భద్రత కోసం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ ప్రత్యేకంగా అమన్ అల్ ముజాహిద్ పేరుతో ప్రత్యేకంగా ఓ మొబైల్ యాప్‌ను రూపొందించినట్టు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అరెస్ట్ చేసిన ఐసిస్ అనుబంధ సంస్థ జుందుల్ ఖిలాఫ్ పీ బిలాద్ అల్ హింద్(జేకేబీహెచ్) ఉగ్రవాదుల విచారణలో బయటపడింది. ఉగ్రవాదులు మహ్మద్ ఇబ్రహీం యజ్దానీ, నైమతుల్లా హుస్సేనీ, మహ్మద్ ఇలియాస్ యజ్దానీ, అబ్దుల్ బిన్ అమ్మద్ అల్ మౌదీ అలియాస్ ఫవద్, మహ్మద్ అధవుర్ రెహ్మాన్, మహ్మద్ ఇర్ఫాన్, ముజఫర్ హుస్సేన్ రిజ్వాన్‌ల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్ల ద్వారా కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందుకు సంబంధించిన అభియోపత్రాలను గత నెలలో నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన ఎన్ఐఏ పలు విషయాలను పొందుపరిచింది. దీని ప్రకారం..
ఉగ్రవాదులు తమ ఉనికి బయటపడకుండా పలు జాగ్రత్తలు తీసుకున్నారు. నిఘా కంటికి చిక్కకుండా ఉండేందుకు అల్ ఫజర్ మీడియా సెంటర్ పేరుతో ఉగ్రవాదుల కోసం ప్రత్యేకంగా ఓ మీడియా వింగ్ పనిచేస్తోంది. డార్క్ నెట్ సైట్స్, యాప్స్ నిర్వహిస్తున్న ఈ సంస్థ వీటిని అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా అల్ ఫజర్ టెక్నికల్ కమిటీని కూడా ఐసిస్ ఏర్పాటు చేసింది. ఇది అమన్ అల్ ముజాహిద్ పేరుతో యాప్, టుటానోటా యాప్,డార్క్‌నెట్ వినియోగంపై ఎఫ్‌టీసీని రూపొందించినట్టు ఎన్ఐఏ కోర్టుకు సమర్పించిన నివేదికలో పేర్కొంది.
పోలీసులు, నిఘావర్గాలకు చిక్కకుండా, తమ వారికి తప్ప మిగతా వారికి కనిపించకుండా ఉండేందుకు ఉగ్రవాదులు డార్క్‌నెట్‌ను ఉపయోగిస్తున్నారు. దీంతోపాటు టోర్స్ అనే ఆపరేటింగ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసుకోవడం ద్వారా ఉగ్రవాదులు సమాచార మార్పిడిని సులభంగా చేసుకుంటున్నారు. డార్క్ నెట్‌కు సంబంధించిన సర్వర్లు, వాటి చిరునామాలు బయటకు తెలిసే అవకాశం లేకపోవడంతోనే ఉగ్రవాదులు దీనిని ఉపయోగిస్తున్నారని ఎన్ఐఏ నివేదికలో పేర్కొంది.