: దీపతో ఎక్కువగా మాట్లాడలేకపోయా: ‘రియో’ విజేత సిమోన్ బైల్స్


రియో ఒలింపిక్స్  సమయంలో మన జిమ్నాస్ట్ దీపా కర్మాకర్ తో తాను ఎక్కువగా మాట్లాడలేకపోయానని బంగారు పతక విజేత సిమోన్ బైల్స్ చెప్పింది. ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, జిమ్నాస్టిక్స్ కి అంతగా ప్రాధాన్యం లేని భారత్ నుంచి దీప లాంటి జిమ్నాస్ట్ రావడం విశేషమని, ఆమె చేసే ప్రమాదకరమైన ప్రొడునోవా విన్యాసం తాను మాత్రం చచ్చినా చేయనని అన్నారు. ప్రొడునోవా విన్యాసం చేయాలనుకోవడం గొప్ప సాహసమని, ఆ విన్యాసం తాను మాత్రం ఎప్పటికీ చేయబోనని స్పష్టంగా పేర్కొంది.

ఎంతో జాగ్రత్తగా చేయాల్సిన ఈ విన్యాసంలో ఏ కొంచెం తేడా వచ్చినా మెడకు తీవ్రమైన గాయం కావడమే కాదు, ప్రాణాంతకమూ కావచ్చని చెప్పింది. ఔత్సాహిక జిమ్నాస్ట్ లకు దీపా కర్మాకర్ స్ఫూర్తినిస్తుందని సిమోన్ చెప్పింది. కాగా, సిమోన్ బైల్స్ రియో ఒలింపిక్స్ లో నాలుగు బంగారు పతకాలు, ఓ కాంస్య పతకం సాధించింది. ఒకే ఒలింపిక్స్ లో అత్యధిక పతకాలు సాధించిన తొలి అమెరికన్ జిమ్నాస్ట్ గా సిమోన్ రికార్డుల కెక్కింది. గతంలో రొమేనియాకు చెందిన జిమ్నాస్ట్ ఇకాటెరీనా జాబో నాలుగు బంగారు పతకాలు సాధించిన రికార్డును సిమోన్ అధిగమించింది. 

  • Loading...

More Telugu News