jagan: 108 నెంబరుకి ఫోను కొడితే అంబులెన్సులు రావడం లేదు: చంద్రబాబు ప్రభుత్వంపై జగన్ విమర్శలు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్‌రెడ్డి ఈ రోజు ప్రకాశం జిల్లా పీసీ పల్లిలో పర్యటిస్తున్నారు. అక్కడ కిడ్నీ వ్యాధిగ్రస్తులను ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... ఆరోగ్యశ్రీ పథకాన్ని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నీరుగార్చిందని అన్నారు. కిడ్నీలు పనిచేయని కారణంగా రక్తాన్ని శుభ్రం చేసే పద్ధతిని డయాలసిస్ అంటారని, అందుకు వారానికి కనీసం 4000 వేల రూపాయలు ఖర్చుఅవుతుందని, అదే నెలకి, సంవత్సరానికి అయ్యే ఖర్చు ఎంత? అని ఆయన ప్రశ్నించారు. పేదలు అంతఖర్చు ఎలా పెట్టుకుంటారని ఆయన అడిగారు.
ఒక్క కిడ్నీ వ్యాధి బాధితుల పరిస్థితే కాదని, ఎంతో మంది పేదలు ఎన్నో వ్యాధులతో బాధపడుతుంటే ఆరోగ్య శ్రీ సేవలను మాత్రం ప్రభుత్వం సరిగా అందించడం లేదని జగన్ విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్య శ్రీకి నామమాత్రంగానే నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ఆ పథకానికి 901కోట్ల రూపాయలు అవసరమైతే కేవలం 568 కోట్ల రూపాయలు మాత్రమే ఇచ్చారని ఆయన అన్నారు. వైద్య ఖర్చులకు పేదవారు బాధపడుతుంటే వారి బాధలు చంద్రబాబు నాయుడికి పట్టడం లేదని విమర్శించారు. 108 నెంబరుకి ఫోను కొడితే అంబులెన్సులు కూడా రావడం లేదని, వైద్య సాయం అందించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంతో వ్యవహరిస్తోందని చెప్పారు.