: ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్.. 15 పరుగుల తేడాతో భారత్ విజయం!


రెండో వన్డేలో భారత జట్టు విజయం సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ జట్టు ఓడినప్పటికీ అద్భుతమైన ఆటతీరుతో ఆకట్టుకుంది. ప్రధానంగా ఇంగ్లండ్ కెప్టెన్ క్రీజులో ఉన్నంత సేపు భారత్ నుంచి విజయాన్ని లాగేసుకునేలా కనిపించాడు. దీంతో కోహ్లీ తీవ్ర ఒత్తిడికి లోనయ్యాడు. బౌలర్లపై ఒత్తిడి పెంచాడు. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవడంతో భారత జట్టు బ్యాటింగ్ ఆరంభించింది.

ధావన్ (14) సహజ శైలిలో ఆడగా, కేఎల్ రాహుల్ (5) మరోసారి ఘోరంగా విఫలమయ్యాడు. అనంతరం క్రీజులోకిచ్చి కెప్టెన్ కోహ్లీ (8) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. దీంతో కేవలం 25 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన యువరాజ్ సింగ్ (150), మహేంద్ర సింగ్ ధోనీ (134) విశ్వరూపం ప్రదర్శించడానికి తోడు చివర్లో కేదార్ జాదవ్ (22), హార్డిక్ పాండ్య (19), రవీంద్ర జడేజా (16) బాగా ఆడడంతో భారత్ 381 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.

అనంతరం 382 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ అద్భుతంగా ఆడింది. ప్రధానంగా సెంచరీతో ఆకట్టుకున్న కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (102) క్రీజులో ఉన్నంత సేపూ మ్యాచ్ ఇంగ్లండ్ పైచేయిగా సాగింది. జాసన్ రాయ్ (84) అద్భుతంగా రాణించడానికి తోడు జోస్ బట్లర్ (55), జోరూట్ (54) అర్ధసెంచరీలతో ఆకట్టుకోవడంతో విజయం రెండు జట్ల మధ్య దోబూచులాడింది.

మధ్యలో స్పిన్నర్లు అశ్విన్, జడేజా పరుగులు కట్టడి చేస్తూ వికెట్లు తీయడానికి తోడు, భువనేశ్వర్ కుమార్ చివర్లో వేసిన బంతులు భారత్ కు విజయం తెచ్చాయి. దీంతో మూడు వన్డేల సిరీస్ లో రెండు విజయాలు సాధించిన భారత జట్టు మ్యాచ్ లో విజయంతోపాటు సిరీస్ ను కూడా కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News