: పొరపాటు పడిన ట్రంప్.. వేరే అమ్మాయిని తన కుమార్తే అనుకుని ట్యాగ్ చేసిన వైనం!
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ పొరపాటు పడ్డారు. తన కుమార్తె అనుకుని వేరే అమ్మాయి పేరును ట్యాగ్ చేయడంతో ఆయన చేసిన ట్వీట్ కుమార్తెకు బదులు బ్రిటన్‌కు చెందిన అమ్మాయికి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ ట్వీట్ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ కుమార్తె ఇవాంకాపై సీఎన్ఎన్ ప్రత్యేక కథనాన్ని ప్రచురిస్తోందని, ఆ కథనం చేస్తున్నది సీఎన్ఎన్ కాబట్టి ఆ స్టోరీ అంత బాగుంటుందని తాను అనుకోవడం లేదంటూ ట్రంప్ తన ఖాతాలో ట్వీట్ చేశారు.
ట్రంప్ ట్వీట్‌కు గుడ్‌స్టీన్ అనే అభిమాని స్పందిస్తూ 'ఇవాంకా నిజమైన క్యారెక్టర్, క్లాస్ ఉన్న అమ్మాయి' అని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌ను చూసిన ట్రంప్ దానిని రీట్వీట్ చేస్తూ తన కుమార్తె ఇవాంకాకు బదులు బ్రిటన్‌కు చెందిన ఇవాంకా మ్యాజిక్ అనే పేరున్న అమ్మాయిని పొరపాటున ట్యాగ్ చేశారు. దీంతో అదికాస్త ఆమెకు వెళ్లిపోయింది. ట్రంప్ రీట్వీట్ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ట్రంప్ ట్వీట్‌ను ఇప్పటికే 4 వేల మంది రీట్వీట్ చేశారు. ఇంత జరుగుతున్నా ట్రంప్ ఇంకా దానిని సరిచేయలేదు.