: 'శాతకర్ణి' సినిమా షూటింగ్ జరిగిన విధం.. క్రిష్ మాటల్లో..!

కేవలం 79 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినీ ప్రముఖులందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. ఇంత తక్కువ సమయంలో అత్యున్నత విలువలతో సినిమాను తెరకెక్కించారంటూ దర్శకుడు క్రిష్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమాను తెరకెక్కించిన విధానంపై క్రిష్ పలు విషయాలను తెలిపారు. ఆ విషయాలను ఆయన మాటల్లోనే చూద్దాం.

"మొత్తం సినిమాను నాలుగు భాగాలుగా విడగొట్టా. ఒక సెటప్ అమరావతి, రెండోది మొరాకో. సౌరాష్ట్ర, కల్యాణదుర్గం మూడో సెటప్. గ్రీకులతో జరిగే చివరి యుద్ధం చివరిది. ఈ నాలుగు భాగాలను మళ్లీ ఉపభాగాలుగా విడగొట్టాం. టీమ్ మొత్తాన్ని మూడు భాగాలుగా విభజించాం. మొరాకో షెడ్యూల్ కు ముందుగానే చిలుకూరు వద్ద ఓడ సెట్ వేశాం. అక్కడ యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తుండగానే... మరో యూనిట్ ను మొరాకోకి, ఇంకో యూనిట్ ను మహేశ్వరానికి పంపాం. చిత్రీకరణ పూర్తయిన దాన్ని ఎప్పటికప్పుడే ఎడిటింగ్ చేయించాం. వీటన్నిటికన్నా ముందుగానే కాస్ట్యూమ్స్ డిజైన్ చేయించాం.

పంచభూతాల సహకారం కూడా మాకు చాలా ఉంది. పక్కా ప్లానింగ్ తో, నా దగ్గర ఉన్న వనరులన్నింటినీ చక్కగా ఉపయోగించుకున్నా. అందుకే అనుకున్న సమయానికే సకాలంలో షూటింగ్ పూర్తి చేయగలిగాం. దేవుడు దయ లేకపోతే ఇంత పెద్ద ప్రాజెక్టును పూర్తి చేయలేకపోయేవాళ్లం", అని క్రిష్ తెలిపారు. కేవలం టైటిల్ మాత్రమే విని... బాలయ్యకు కథ చెప్పడానికి అపాయింట్ మెంట్ తీసుకొచ్చిన కొమ్మినేని వెంకటేశ్వరరావుకు ధన్యవాదాలు చెబుతున్నానని ఆయన అన్నారు. తన తదుపరి సినిమా  వెంకటేష్ 75వ చిత్రమని... ఆ తర్వాత బాలీవుడ్ సినిమా ఉంటుందని చెప్పారు. 

More Telugu News