: 'మతం పేరిట రెచ్చగొడితేనే చంపారు' అంటూ ముస్లిం యువకుడిని హత్య చేసిన వారికి బెయిలిచ్చిన బాంబే హైకోర్టు!


ఓ ముస్లిం యువకుడిపై హాకీ కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి, హత్య చేసిన కేసులో 2014 నుంచి జైల్లో ఉన్న ముగ్గురికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మతం పేరిట వ్యాఖ్యానించినందునే వారు ఈ హత్య చేశారని చెబుతూ, వారు బెయిల్ పొందేందుకు అర్హులేనని సంచలన రూలింగ్ ఇచ్చింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ కేసులో 21 మందిపై కేసులు నమోదుకాగా, ముగ్గురిని మాత్రమే పోలీసులు అరెస్ట్ చేశారు.

జూన్ , 2014న మోహసీస్ షేక్ అనే యువకుడు తన స్నేహితుడితో కలసి డిన్నర్ చేసి బైకుపై వస్తుండగా, కొంతమంది వారిపై దాడి చేశారు. హాకీ స్టిక్స్ తో కొడుతూ, రాళ్లు విసురుతూ చావగొట్టారు. తీవ్ర గాయాలతో మహసీన్ అక్కడికక్కడే మరణించగా, అతని స్నేహితుడు పారిపోయాడు. ఈ కేసులో హిందూ రాష్ట్ర సేనకు చెందిన విజయ్ రాజేంద్ర గంభీర్, రజనీత్ శంకర్ యాదవ్, అజయ్ దిలీప్ లగాలేలను పోలీసులు అదుపులోకి తీసుకుని చార్జ్ షీట్ దాఖలు చేశారు. వారు బెయిలుకు దరఖాస్తు చేసుకోగా, తన ఫేస్ బుక్ ఖాతాలో శివాజీకి, శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరేకు వ్యతిరేకంగా మొహసీన్ వ్యాఖ్యలు చేసినట్టు కోర్టు గుర్తించింది.

ఈ కేసు వెనక చాలా విషయాలను పరిశీలించామని, నిందితులకు ఎటువంటి నేర చరిత్రా లేదని, మృతుడు చేసిన మతపరమైన వ్యాఖ్యల కారణంగానే ఉద్రేకంతో చేసిన దాడిలో అతను మరణించాడని న్యాయమూర్తి మృదులా భత్కర్ అభిప్రాయపడ్డారు. వారికి బెయిల్ ఇస్తున్నట్టు ప్రకటించారు. కాగా, హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేయనున్నట్టు మొహసీన్ కుటుంబ సభ్యులు తెలిపారు. రెచ్చగొట్టినట్టు మాట్లాడితేనే హత్య చేసేస్తారా? అని మొహసీన్ తండ్రి సాదిక్ షేక్ ఉద్వేగంగా ప్రశ్నించారు.

  • Loading...

More Telugu News