: నా జన్మ ధన్యమైపోయింది: ‘శాతకర్ణి’ మాటల రచయిత సాయిమాధవ్
‘గౌతమి పుత్ర శాతకర్ణి’ చిత్రానికి మాటలు అందించడంతో తన జన్మ ధన్యమైపోయిందని మాటల రచయిత సాయిమాధవ్ బుర్రా అన్నారు. ఈ రోజు ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... ఈ సినిమాకు మాటలు రాయడం తన అదృష్టమని అన్నారు. క్రిష్ రుణం ఎలా తీర్చుకోవాలో తనకు అర్థం కావడం లేదని, ఏం చేసినా ఆ రుణం తీర్చుకోలేనని అన్నారు. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి వ్యక్తి తన తల్లి పేరు తెరపై చూసుకున్నారని, తల్లి పేరును నిలబెట్టుకునే అవకాశం వచ్చిందని అన్నారు.
ఈ సినిమాకి పనిచేయడం పట్ల తన ఆనందాన్ని ఎలా వ్యక్తం చేయాలో కూడా తెలియని పరిస్థితి ఉందని సాయిమాధవ్ అన్నారు. ఈ సినిమాలో వృథాగా ఒక్క సన్నివేశం కూడా లేదని అన్నారు. ఈ సినిమాలో అన్ని సీన్లలోనూ అద్భుతాంశాలు ఉన్నాయని, ఈ సినిమాలో ఒక్క సీను లేకపోయినా కథ ముందుకు నడవదేమో అన్నట్లు ఉంటుందని చెప్పారు. బాలకృష్ణ 100వ సినిమాకి మాటలు రాసే అవకాశం వస్తుందని తాను అస్సలు అనుకోలేదని అన్నారు. కొన్ని సమయాల్లో తన డైలాగులు నచ్చుతాయో నచ్చవోనని టెన్షన్ పడ్డానని అన్నారు.