: 14 ఏళ్లలో వందల మంది అమ్మాయిలపై పైశాచికకాండ... ఢిల్లీలో అరెస్టయిన కామ పిశాచి!

అతను ఐదుగురు బిడ్డలకు తండ్రి... అయితేనేం కామ పిశాచి. గడచిన 14 సంవత్సరాల్లో వందల మంది అమ్మాయిలపై తన కోరికలు తీర్చుకున్నాడు. తమకందిన ఫిర్యాదుల్లో భాగంగా 38 సంవత్సరాల దర్జీ సునీల్ రస్తోగీని అరెస్ట్ చేసిన అనంతరం పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. గత సంవత్సరం డిసెంబరులో ముగ్గురు అమ్మాయిలపై అత్యాచారం జరిగినట్టు వచ్చిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన పోలీసులు, సునీల్ ను అరెస్ట్ చేశారు. ఇంతకాలం నుంచి అతను ఎలా తప్పించుకు తిరిగాడన్న విషయం పోలీసులకు సైతం అంతుపట్టడం లేదు. 2006లో ఆరు నెలల పాటు ఉత్తరాఖండ్ లోని రుద్రాపూర్ జైల్లో శిక్షను అనుభవించి వచ్చిన ఈ దుర్మార్గుడు, 7 నుంచి 10 సంవత్సరాల వయసున్న అమ్మాయిలను టార్గెట్ చేసేవాడు.

పాఠశాలలకు వెళ్లి వస్తున్న ఒంటరి అమ్మాయిలను గుర్తించి, వారి తండ్రి బట్టలు, బహుమతులు పంపాడని మాయమాటలు చెబుతూ, వారిని ఒంటరి ప్రాంతాలకు తీసుకెళ్లి లైంగిక దాడులు చేసేవాడని సీనియర్ పోలీస్ అధికారి ఓంవీర్ సింగ్ వెల్లడించారు. 2004లో తన పక్కింట్లోని అమ్మాయిపై దాడి చేసినందుకు ఇరుగు పొరుగు వారు కొట్టి తరిమారని చెప్పారు. డిసెంబర్ 13న ముగ్గురు బాధితుల నుంచి అందిన ఫిర్యాదులు, వారు చెప్పిన వివరాల ప్రకారం విచారణ జరిపి ఈ కామాంధుడిని అరెస్ట్ చేసినట్టు చెప్పారు. పలు సీసీటీవీ కెమెరాల ఫుటేజీల్లో ఇతనే నిందితుడని తేలినట్టు వెల్లడించారు. ఇతనికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారని, వారిపైనా ఇలాంటి దాడులు చేశాడా? అన్న కోణంలోనూ దర్యాఫ్తు చేస్తున్నామని ఓంవీర్ పేర్కొన్నారు.

More Telugu News