: 'ఖైదీ నంబర్ 150'... టికెట్ ధర 25 డాలర్లు, డిస్కౌంట్ 23 డాలర్లు!
చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150' టికెట్లకు అమెరికాలో ఏకంగా 92 శాతం డిస్కౌంట్ ఇస్తుండటం హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రాన్ని యూఎస్ లోని దాదాపు అన్ని రాష్ట్రాల్లో విడుదల చేయగా, విడుదలైన ఐదవ రోజు నుంచి ఈ డిస్కౌంట్లు మొదలయ్యాయి. యూఎస్ లోని ఏపీ, టీఎస్ ప్రజల్లో అత్యధికులు 'పండాన్గో' (fandango.com) వెబ్ సైట్ ద్వారా టికెట్లను కొనుగోలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే.
ఇక మంగళవారం నాడు కాలిఫోర్నియా పరిథిలోని 'మిల్పిటాస్'లో ఉన్న 'సెంచరీ 20 గ్రేట్ మాల్ అండ్ ఎక్స్ డీ' థియేటరులో రెండు డాలర్లకే టికెట్ లభించింది. ఒక టికెట్ ఖరీదు 24 డాలర్లు, కన్వీనియన్స్ ఫీజు 1.35 డాలర్లు కాగా, డిస్కౌంట్ 23.35 డాలర్లు ఇచ్చారని, కేవలం 2 డాలర్లకే టికెట్ లభించిందని చూపుతున్న సదరు థియేటర్ టికెట్ ఇప్పుడు ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది. చిత్రం విడుదలకు ముందు డిస్కౌంట్లు లేవని, ఆపైనే ఇస్తున్నారని సమాచారం.
ఇక ఈ చిత్రంపై ఓవర్సీస్ కలెక్షన్ల గురించి నిర్మాతలు సరైన సమాచారాన్ని చెప్పడం లేదా? అన్న కొత్త చర్చ మొదలైంది. వాస్తవానికి అమెరికాలో డిస్కౌంట్లు ఇవ్వడం తొలిసారేమీ కాదు. ఒక్కోసారి టికెట్ కు పెట్టిన ఖరీదంతా కూడా క్యాష్ బ్యాక్ రూపంలో లభిస్తుంటుంది. అయితే, చిరంజీవి చిత్రానికి, అది కూడా విడుదలై వారం కూడా కాకుండానే ఏకంగా 92 శాతం డిస్కౌంట్ ప్రకటించడమే కొత్త చర్చకు దారితీస్తోంది.