: అఖిలేష్- రాహుల్ పొత్తు... రంగంలోకి డింపుల్, ప్రియాంక!

ఉత్తరప్రదేశ్ లో తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్, కనీసం అధికారంలో కాస్త భాగం ఉన్నా చాలని భావిస్తున్న కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు దాదాపు కుదిరిపోయినట్టేనని తెలుస్తోంది. ఈ రెండు పార్టీలతో పాటు మరికొన్ని చిన్న పార్టీల కూటమి కలసికట్టుగా బీజేపీ, బీఎస్పీలను ఎదుర్కోనున్నాయని తెలుస్తోంది.

ఇక రాష్ట్రంలో ప్రచార బాధ్యతలను రాహుల్ సోదరి ప్రియాంకా గాంధీ, అఖిలేష్ సతీమణి డింపుల్ యాదవ్ లకు అప్పగించనున్నట్టు సమాచారం. రాహుల్, అఖిలేష్ మధ్య పొత్తుపై అధికారిక ప్రకటన మాత్రమే వెలువడాల్సి వుందని సమాజ్ వాదీ పార్టీ, అఖిలేష్ వర్గానికి చెందిన నేత ఒకరు తెలిపారు. పొత్తు ప్రకటనను ఇరువురు నేతలూ కలసి చేయనున్నారని తెలిపారు.

కాగా, డింపుల్ ప్రస్తుతం కనోజ్ నియోజకవర్గానికి ఎంపీగా ఉన్నప్పటికీ, రాజకీయాల్లో పెద్దగా పాలుపంచుకున్నది లేదు. ఇక ప్రియాంక యూపీకి కొత్త కాకపోయినా, అమ్మ, సోదరుడు ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్ బరేలీ, అమేథీ నియోజకవర్గాలకే అధికంగా పరిమితమయ్యారు. వీరిని ముందు నిలిపితే ప్రజలను, ముఖ్యంగా మహిళా ఓటర్లను ఆకర్షించవచ్చని ఈ పార్టీలు భావిస్తున్నాయి.

More Telugu News