: ఒక వైపే ముద్రితమైన ఐదొందల నోటు!


మధ్యప్రదేశ్ లో రైతులు అక్కడి బ్యాంక్ కు వెళ్లి డ్రా చేస్తే మహాత్మా గాంధీ చిత్రం లేని రెండు వేల రూపాయల నోట్లను ఇచ్చిన సంఘటన ఇటీవల జరిగిన విషయం తెలిసిందే. దీనిని మరచిపోకముందే, మరో సంఘటన అదే రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఐదొందల రూపాయల నోటు ఒక వైపు మాత్రమే ప్రింట్ అయి వచ్చింది. ఖర్గోన్ జిల్లాలోని ఒక ఏటీఎం లో డ్రా చేసినప్పుడు ఈ కొత్త 500 నోటు వచ్చింది. హేమంత్ సోనీ అనే వ్యక్తి సెగావ్ గ్రామంలోని ఒక ఏటీఎం కేంద్రానికి వెళ్లి తన ఏటీఎం కార్డుతో రూ.1500 డ్రా చేశాడు.

మూడు 500 నోట్లు రాగా, వాటిలో ఒకదానికి ఒకవైపు ముద్రణ లేకుండా కేవలం తెల్లగా మాత్రమే ఉందని, ఈ విషయాన్ని వెంటనే బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకువెళ్లానని చెప్పాడు. ఆ నోటును తీసుకున్న అధికారులు, వేరే ఐదొందల నోటు ఇచ్చారని పేర్కొన్నాడు. కాగా, ఈ విషయమై బ్యాంకు అధికారులు మాట్లాడుతూ, రిజర్వ్ బ్యాంకు నుంచి వచ్చిన ఆ నోటు ప్రింటింగ్ లో జరిగిన పొరపాటు వల్లే ఇలా జరిగిందని, దొంగనోటు కాదని స్పష్టం చేశారు.
  

  • Loading...

More Telugu News