: హైదరాబాద్ లో విప‌రీతంగా రెచ్చిపోతున్న పోకిరీలు, ఈవ్‌టీజర్లు, సైబ‌ర్ నేర‌గాళ్లు!


భారత్‌లో నగదురహిత లావాదేవీలు ఎంత‌గా పెరిగిపోతున్నాయో అంతే స్థాయిలో సైబ‌ర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దేశంలోని అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల్లో సైబ‌ర్ నేర‌గాళ్లు బ్యాంకు ఖాతాదారులకు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నారు. మ‌రోవైపు సెల్‌ఫోన్‌ల‌కు అస‌భ్య సందేశాలు, వీడియోలు పంపిస్తున్నవారి సంఖ్య కూడా రోజురోజుకీ పెరిగిపోతోంది. అయితే, వీటిపై పోలీసుల‌కు ఫిర్యాదు చేసే వారి సంఖ్య మాత్రం అతి త‌క్కువ‌గా ఉంటోంది. ఇత‌రుల చేతిలో మోస‌పోయామ‌ని అంద‌రికీ తెలిస్తే త‌మ ప‌రువు పోతుందేమోన‌న్న భ‌యంతో క‌నీసం పోలీసుల‌కి ఫిర్యాదు చేయ‌డానికి కూడా వెన‌కాడుతున్నారు బాధితులు.

ప్ర‌జ‌ల ఖాతాల నుంచి డ‌బ్బు కొట్టేయాల‌న్న టార్గెట్ పెట్టుకుంటున్న సైబ‌ర్ నేర‌గాళ్లతో పాటు ఇతరులను వేధించి ఆనందించాలనుకుంటున్న కొందరు దుండగులు ముఖ్యంగా విద్యార్థినులు, మహిళలు, ఉద్యోగులు, వైద్యులను ల‌క్ష్యంగా పెట్టుకుంటున్నార‌ట‌. యువ‌తుల ఫోన్‌ నంబర్లు, సోష‌ల్ మీడియా ఖాతాల‌ను తెలుసుకుని అనుక్ష‌ణం వారిని వేధిస్తూ రాక్ష‌సానందం పొందుతున్నారు. అయితే, బాధితుల్లో 90 శాతం మంది తమకు కేసులొద్దని అంటున్నార‌ట‌. కొంద‌రు బాధితులు తమను వేధించిన వారిని హెచ్చ‌రించాల‌ని, భవిష్యత్తులో తమ జోలికి రాకుండా చూడాల‌ని మాత్రమే పోలీసుల‌ను కోరుతున్నార‌ట‌. దీంతో చట్ట ప్రకారం పోకిరీలు, ఈవ్‌టీజర్లపై పోలీసులు కేసులు నమోదు చేయడం లేదు.

ఓ ప్రైవేటు కార్యాలయంలో ఓ యువ‌తికి ఓ వ్య‌క్తి అస‌భ్య‌క‌ర‌మైన మెసేజ్‌లు, వీడియోలు పంపించాడు. చివ‌రికి ఆమె పోలీసులకి ఫిర్యాదు చేయ‌డంతో త‌న‌ని వేధిస్తున్నది ఎవ‌రో కాదు త‌న‌ బాసేన‌ని తెలిసింది. హైద‌రాబాద్‌లోని బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో 8 మంది మహిళా వైద్యులను వేధించి కొంద‌రు వ్య‌క్తులు చివ‌ర‌కు పోలీసులకు చిక్కారు. ఆసుపత్రుల నేమ్‌ప్లేట్ల‌పై రాసి ఉన్న స‌ద‌రు డాక్ట‌ర్ల సెల్‌ఫోన్ నంబ‌ర్లను రాసుకొని వారికి అస‌భ్య సందేశాలు పంపించిన‌ట్లు పోలీసులు తేల్చారు. ఇటీవ‌లే న‌గ‌రంలోని నారాయణగూడలో ఓ ప్రైవేటు కళాశాల విద్యార్థినికి ప‌లుసార్లు ఫోన్ చేసిన‌ కొంద‌రు దుండ‌గులు వేధింపుల‌కు గురిచేయ‌డంతో ఆ విష‌యాన్ని ఇంట్లో చెప్పలేక ఆ యువ‌తి ఆత్మహత్యాయత్నం చేసింది.

ఇక  సైబ‌ర్ నేర‌గాళ్ల విష‌యానికొస్తే సెల్‌ఫోన్‌ల‌కి ఫోన్ చేస్తోన్న కొంద‌రు దుండ‌గులు మాయ‌మాట‌లు చెప్పి, బ్యాంకు ఖాతాదారుల పాస్‌వ‌ర్డుల‌ను తెలుసుకొని రూ.లక్షలు దోచుకుంటున్నారు. అయితే, హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రోజుకు సగటున 500 మంది ఖాతాల్లో నగదు మాయమవుతుండగా.. వారిలో పోలీసులకు ఫిర్యాదు చేసే వారి సంఖ్య‌ 10 నుంచి 15 మంది మాత్రమే ఉంటున్నారు. కామాంధులు ఫోన్‌లు చేసి వేధించినా, సైబ‌ర్ నేర‌గాళ్లు ఖాతాల నుంచి డ‌బ్బు దోచుకున్నా త‌మ‌కు ఫిర్యాదు చేయాల‌ని పోలీసులు కోరుతున్నారు. నిందితులు ఎక్కడున్నా పట్టుకొని తీరుతామ‌ని, బాధితులకు అండ‌గా నిలుస్తామ‌ని చెబుతున్నారు. బాధితులు కేవ‌లం త‌మ‌కు ఫిర్యాదు చేస్తే చాలని, మిగతాది తాము చూసుకుంటామ‌ని అంటున్నారు.

హైదరాబాద్‌ పోలీస్‌ వెబ్‌సైట్‌, సైబర్‌క్రైమ్స్‌ ట్విట్టర్‌, ఫేస్‌బుక్‌ ద్వారా ఫిర్యాదులు చేయ‌వ‌చ్చ‌ని పోలీసులు సూచిస్తున్నారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌ల ద్వారా సందేశాలు పంపుతూ పలు కంపెనీల నుంచి ఆఫర్లున్నాయని ఆశ‌లు చూపి వ‌స్తువులు కొనుగోలు చేస్తే రూ.లక్షల్లో లాభం వస్తుందని న‌మ్మ‌బ‌లికి ప‌లు లింకులు క్లిక్ చేయ‌మని చెబుతున్నారు. ఆపై ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి డ‌బ్బు కొట్టేస్తున్నారని పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News