: 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై చంద్రబాబుకు వ్యతిరేకంగా హైకోర్టులో పిటిషన్
ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు ప్రభుత్వం బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి నిబంధనలకు విరుద్ధంగా పన్ను మినహాయింపులను ఇచ్చిందని, దీనిపై తక్షణం స్టే విధించాలని కోరుతూ తెలుగు రాష్ట్రాల హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ చిత్ర కథానాయకుడు బాలకృష్ణ తన వియ్యంకుడు కాబట్టే, చంద్రబాబు పన్ను మినహాయింపు ఇచ్చారని ఆరోపిస్తూ, ఓ న్యాయవాది లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు, కేసును తక్షణం విచారించనక్కర్లేదని అభిప్రాయపడింది. చిత్రం విడుదల రేపే అయినా, నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని తేలితే, నిర్మాత నుంచి పన్ను డబ్బు వసూలు చేసుకోవచ్చని పేర్కొన్న న్యాయమూర్తి, రెగ్యులర్ బెంచ్ కి వెళ్లి పిటిషన్ దాఖలు చేయాలని సూచించారు. కాగా, ఈ చిత్రానికి తెలంగాణ సర్కారు సైతం పన్ను రాయితీలు కల్పించిన సంగతి తెలిసిందే.