: అబద్ధాలు చెబుతున్న బీఎస్ఎఫ్... ఎంత బాధపడి ఆ వీడియో పెట్టాడో?: తిండి పెట్టట్లేదన్న జవాను కుటుంబం


తమకు సరైన ఆహారం పెట్టడం లేదని ఆరోపిస్తూ, బీఎస్ఎఫ్ జవాను తేజ్ బహదూర్ యాదవ్ పెట్టిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించగా, అతనో మందుబాబని, అతని మాటలు అవాస్తవమని బీఎస్ఎఫ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ వివాదంపై బహదూర్ కుటుంబం స్పందించింది. వీడియోలో తన భర్త చెప్పిన మాటలు నిజమని నమ్ముతున్నట్టు ఆయన భార్య షర్మిల పేర్కొంది. తన భర్తకు మతిస్థిమితం లేదని బీఎస్ఎఫ్ చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ, సైనికుల సంక్షేమం కోసమే తన భర్త వాటిని బయటపడ్డాడని, ఎంతో బాధతోనే ఆ వీడియో పెట్టుంటారని, మంచి ఆహారం పెట్టాలని డిమాండ్ చేయడం తప్పెలా అవుతుందని ప్రశ్నించారు.

తన భర్త మానసికంగా దృఢంగా లేకుంటే, అతనిని సైన్యంలో ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. తన భర్త వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బహదూర్ కుమారుడు రోహిత్ సైతం ఇదే విధమైన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి తన తండ్రితో తాము మాట్లాడే అవకాశాన్ని అధికారులు ఇవ్వలేదని ఆరోపించాడు. ఆయనెక్కడున్నారన్న సమాచారం సైతం తెలియడం లేదని తెలిపాడు. ఆయన క్షేమంగా ఉన్నాడన్న సమాచారాన్ని అధికారుల నుంచి కోరుకుంటున్నట్టు వెల్లడించాడు.

  • Loading...

More Telugu News