: తమ విడాకులపై తొలిసారిగా బ్రాడ్ పిట్, ఏంజెలినాల సంయుక్త ప్రకటన
హాలీవుడ్ జంట బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ తమ విడాకులపై తొలిసారిగా ఒక సంయుక్త ప్రకటన చేశారు. తమ విడాకులకు సంబంధించిన కోర్టు డాక్యుమెంట్లు అన్నింటినీ రహస్యంగా ఉంచాలనే అంగీకారానికి తామిద్దరం వచ్చామని పేర్కొన్నారు. కుటుంబం, పిల్లలకు సంబంధించి వ్యక్తిగత రహస్యాల హక్కులను కాపాడటం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ ప్రకటనలో స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన ఒప్పందంపై బ్రాడ్ పిట్, ఏంజెలినా జోలీ సంతకాలు చేశారు.
కాగా, ఓ ప్రయివేటు విమానంలో బ్రాడ్, ఏంజెలీనాలు తమ పిల్లలతో కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో జరిగిన ఒక సంఘటన వారి విడాకులకు దారి తీసింది. పిల్లల పట్ల బ్రాడ్ పిట్ అనుచితంగా ప్రవర్తించడంతో మనస్తాపం చెందిన ఏంజెలీనా తన భర్త నుంచి తెగదెంపులు చేసుకుంది. ప్రస్తుతం ఇద్దరూ వేరుగా ఉంటున్నారు. బ్రాడ్ పిట్, జోలీ దంపతులకు ముగ్గురు సంతానం కాగా, మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకున్నారు. పిల్లలు మైనర్లు అయినందున వారిని తన వద్దే ఉంచాలని జోలీ భావిస్తుండగా, పిల్లల సంరక్షణ బాధ్యతలను ఇద్దరికీ అప్పగించాలని బ్రాడ్ పిట్ కోరాడు.