: మేమంతా ఒకటే... ఎవరూ విషం కక్కొద్దు: అభిమానులకు మెగాస్టార్ హితవు
సినీ అభిమానులు, బయటి వ్యక్తులు ఏమనుకుంటున్నా, పరిశ్రమలోని అందరూ ఓ కుటుంబంలా కలసి వుంటారని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు. సహచర హీరోలతో తనకు సత్సంబంధాలున్నాయని, అభిమానులు మితిమీరిన అభిమానంతో విషం కక్కేలా ప్రవర్తించ వద్దని సూచించారు. బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' ప్రారంభోత్సవానికి తాను వెళ్లిన విషయాన్ని గుర్తు చేసిన ఆయన, నాగార్జున, వెంకటేష్ తనకు మంచి మిత్రులని చెప్పారు. తన కుమారుడు రామ్ చరణ్ సైతం తోటి హీరోలతో స్నేహంగా ఉంటాడని, ముఖ్యంగా మహేష్, రామ్ చరణ్ బెస్ట్ ఫ్రెండ్సనీ, ఇద్దరూ కలసి విదేశీ టూర్లకు కూడా వెళతారని చెప్పారు. నాగార్జున కుమారుడు అఖిల్ ఏకంగా రామ్ చరణ్ ఇంటికే వచ్చి సమయం గడుపుతూ ఉంటాడని అన్నారు. కొత్త చిత్రాల విడుదల సందర్భంగా అభిమానులు హద్దులు దాటరాదని హితవు పలికారు.