: యూట్యూబ్ టాప్ ట్రెండ్ 'ఖైదీ'యే... ట్రైలర్ కు 30 లక్షల వ్యూస్ వస్తే, 'రత్తాలు'కు 60 లక్షలు దాటేశాయి!
ఎల్లుండి విడుదలకానున్న చిరంజీవి 150 చిత్రం 'ఖైదీ నం. 150' యూట్యూబ్ ట్రెండింగ్ లో దూసుకెళుతోంది. సినిమా ట్రైలర్ విడుదలైన తరువాత ఇప్పటివరకూ 30,55,166 మంది వీక్షించగా, అంతకుముందు విడుదలైన 'రత్తాలు' పూర్తి పాటను 60,83,896 మంది వీక్షించారు. పదేళ్ల పాటు చిత్రాలకు దూరంగా ఉన్న చిరు స్టామినా తగ్గలేదని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఇక ఈ చిత్రం ఆన్ లైన్ బుకింగ్ సైతం జోరుగా సాగుతున్నట్టు తెలుస్తోంది. వచ్చే గురువారం 19 వరకూ ఆన్ లైన్లో టికెట్లు ఉంచగా, ఆదివారం వరకూ బుకింగ్స్ పూర్తయ్యాయి. దాదాపు అన్ని థియేటర్లలో ముందు వరుసలో ఒకటి, రెండు సీట్లు మినహా మిగతా సీట్లన్నీ అమ్ముడైనట్టు తెలుస్తోంది. రెండు, మూడు థియేటర్లు ఉన్న బీ, సీ సెంటర్లలో 11వ తేదీన అన్ని థియేటర్లలోనూ 'ఖైదీ' చిత్రాన్నే ప్రదర్శనకు ఉంచారు. దీంతో తొలి రోజు టాలీవుడ్ కలెక్షన్ల రికార్డును ఈ సినిమా తిరగరాస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.