: అలాంటి సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానమే ఈ సినిమా!: దాసరి
'ఎక్కడ చిరంజీవి ఉంటే అక్కడ జనసముద్రం ఉంటుంది. ఎన్నాళ్లైంది.. ఇలాంటి జనసముద్రాన్ని చూసి' అని ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు అన్నారు. 'ఖైదీ నెంబర్ 150' సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ లో ఆయన మాట్లాడుతూ, ఒక 'ఖైదీ', 'పసివాడి ప్రాణం', 'ఘరానా మొగుడు' ఇలా ఒకటి కాదు, రెండు కాదు.. ఎన్నో అద్భుతమైన ఫంక్షన్స్ జరిగాయని ఆయన చెప్పారు. 8 ఏళ్ల తరువాత హీరో నటించడమనేది చిరంజీవి విషయంలోనే సాధ్యమైందని ఆయన చెప్పారు.
ఎప్పుడు చిరంజీవి మేకప్ వేసుకుని, నటిస్తారా? సినిమా ఎప్పుడు చూస్తామా? అని ఎదురు చూసిన మెగా అభిమానులకు సమాధానమే 'ఖైదీ నెంబర్ 150' అని ఆయన చెప్పారు. 'ఖైదీ' సినిమా తరువాత మెగాస్టార్ గా ఎదిగేందుకు ఎంత కష్టపడ్డాడో అందరికీ తెలుసని ఆయన అన్నారు. 8 ఏళ్ల తరువాత ఫైట్స్ చేస్తాడా? డాన్సులు చేస్తాడా? నటించగలడా? అని సందేహాలు వ్యక్తం చేసిన వారికి సమాధానమే ఈ సినిమా అని ఆయన తెలిపారు.
తన అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలాగే ఆయన కనిపించారని ఆయన చెప్పారు. అభిమానులు ఆశ్చర్యపోయేలా ఆయన ఉంటారని దాసరి చెప్పారు. ఈ సినిమా ఇంట్రడక్షన్ సాంగ్ లో కల్యాణ్, రామ్ చరణ్ కూడా సరిపోరని అంటారని ఆయన చెప్పారు. ఈ రోజు కలెక్షన్లతో దూసుకుపోతున్న వారంతా చిరంజీవిలా డాన్స్ చేయాలని కోరుకుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. సంక్రాంతి పండగకు ముందు '11నే సంక్రాంతి వచ్చినట్టే లెక్క' అని ఆయన అన్నారు. ఈ కథ తనకు తెలుసని చెప్పారు. ఈ సినిమా కధలో అన్ని అంశాలు ఉన్నాయని, 'ఠాగూర్' రికార్డులు సవరించే మంచి సినిమా వస్తోందని ఆయన తెలిపారు. రైతు సమస్యలు తెలియజేసేలా అద్భుతమైన సినిమా అని ఆయన చెప్పారు. పాటలు, ఫైట్స్, స్టోరీ బాగుందని, అభిమానులకు ఇంకేంకావాలని ఆయన అభిమానులను ఉద్దేశించి అన్నారు.