: బెంగళూరులో మారని తీరు.. మరో యువతిపై విచక్షణారహితంగా దాడి
బెంగళూరులో జరుగుతున్న దాడులపై ఓవైపు భారత్ యావత్తూ ఆందోళన వ్యక్తం చేస్తోన్న వేళ... మరోవైపు అదే నగరంలో మరో యువతిపై దాడి జరిగింది. ఇటీవల న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా బెంగళూరులో నడిరోడ్డుపై యువతులపై పలువురు యువకులు అసభ్యంగా ప్రవర్తించిన సంగతి తెలిసిందే. ఆ తరువాత పలువురు నిందితులను పట్టుకున్న పోలీసులు పోకిరీలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. అయినప్పటికీ నిన్న మరో దాడి జరగడం కలకలం రేపుతోంది. బెంగళూరులోని కేజీ హాలి ప్రాంతంలో బురఖా ధరించి రోడ్డుపై వెళుతున్న ఓ యువతిపై ఒక వ్యక్తి అకారణంగా దాడి చేశాడు.
కొద్దిసేపు ఆ యువతిని వెంబడించిన ఆ కామాంధుడు అనంతరం ఆమెను పట్టుకొని వేధించాడు. చివరకు ఆమెను నేలపై తోసివేశాడు. అక్కడున్న వీధికుక్కలు పెద్దగా అరవడంతో స్థానికులు వస్తారన్న భయంతో ఆ నిందితుడు పరారయ్యాడు. ఈ ఘటన అంతా అక్కడి సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయింది. అక్కడికు చేరుకున్నఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధిత యువతి కాళ్లు, చేతులు, నాలుకకు తీవ్రగాయాలు కావడంతో ఆమెకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆమెపై దాడికి దిగిన వ్యక్తి కోసం సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు.