: వ్యతిరేక శక్తులను అణచిపారేద్దాం.. పార్టీ శ్రేణులకు శశికళ పిలుపు
పార్టీ వ్యతిరేక శక్తులను కలిసికట్టుగా ఎదుర్కొని అణచివేద్దామని అన్నాడీఎంకే పార్టీ చీఫ్ వీకే శశికళ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీని మరింత బలంగా తయారుచేసేందుకు అన్ని జిల్లాల పార్టీ నిర్వాహకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో మూడు రోజుల నుంచి సమావేశాలు నిర్వహిస్తున్న శశికళ శుక్రవారం తేని, దిండుగల్ విరుదునగర్ సహా పది జిల్లాల పార్టీ నిర్వాహకులతో చెన్నైలోని రాయపేటలో ఉన్న పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈనెల 17న ఎంజీఆర్ శత జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించాలని, పేదలకు సాయం అందించాలని ఆదేశించారు. అలాగే పార్టీ తరపున బహిరంగ సభలు నిర్వహించాలని కోరారు. జయలలిత మరణాన్ని కొందరు రాజకీయం చేసి లబ్ధి పొందాలని చూస్తున్నారని, వారి కుట్రలను కలిసికట్టుగా అణచివేద్దామని పిలుపునిచ్చారు.
అమ్మ స్ఫూర్తితోనే ప్రభుత్వం ముందుకు వెళుతుందని పేర్కొన్న శశికళ వచ్చే నెల 24న జయ పుట్టిన రోజును పురస్కరించుకుని పేదలకు సహాయ కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఎంజీఆర్ శతజయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించాలని కోరారు. నెలకోసారి వీధుల్లో బహిరంగ సభలు నిర్వహించి ప్రభుత్వ విజయాలు ప్రజలకు వివరించాలన్నారు. అన్నా కార్మిక సంఘం ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని శశికళ ఆదేశించారు.