: దొంగ‌త‌నం చేశార‌ని.. చీమ‌ల‌తో కుట్టించి.. చిత్ర‌హింస‌లు పెట్టి చంపేశారు!


దొంగ‌త‌నం ఆరోప‌ణ‌లతో ఓ కుటుంబాన్ని చెట్టుకు క‌ట్టేసిన కొంద‌రు వారిపైకి విష‌పూరిత చీమ‌లు వ‌దిలి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. చీమ‌లు వారి శ‌రీరాన్ని కొరికి తింటుంటే వారు చేసిన ఆర్త‌నాదాల‌తో ఆ ప్రాంతం మార్మోగింది. అయినా వారి గుండెలు క‌ర‌గ‌లేదు. శ‌రీరాన్ని ముక్క‌లుగా కొరికేసిన చీమ‌లు ఓ మ‌హిళ గొంతును చీల్చుకుని లోప‌లికి చొచ్చుకెళ్లాయి. దీంతో ఆమె మృతి చెందింది. బొలీవియాలోని క‌ర‌నావి మునిసిపాలిటీలో చోటుచేసుకున్న ఈ హృద‌య‌విదార‌క ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది.

పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం..  స్థానికంగా నివ‌సించే ఓ కుటుంబానికి చెందిన కారు ఇటీవ‌ల చోరీకి గురైంది. ఆ చోరీకి పాల్ప‌డింది స‌మీపంలో ఉండే యువ‌కుడి ప‌నేన‌ని అనుమానించిన కొంద‌రు అత‌డిని  ప‌ట్టుకొచ్చి చెట్టుకు క‌ట్టేశారు. అడ్డుకున్న అత‌డి సోద‌రి, త‌ల్లి(52)ని కూడా క‌ట్టేశారు.  అనంత‌రం వారిపైకి విష‌పు చీమ‌ల‌ను వ‌దిలి చిత్ర‌హింస‌ల‌పాలు చేశారు. వారు కేక‌లు వేస్తున్నా వారి హృద‌యాలు క‌ర‌గ‌లేదు. అంద‌రూ చోద్యం చూశారు త‌ప్పితే ఏ ఒక్క‌రు వారిని ర‌క్షించేందుకు ముందుకు రాలేదు. చివ‌రికి స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకుని వారిని రక్షించారు. ఒళ్లంతా గాయాల‌తో ప‌రిస్థితి విష‌మంగా ఉన్న మ‌హిళ‌ను ఆస్ప‌త్రికి త‌ర‌లించగా అక్క‌డ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.

చీమ‌లు ఆమె గొంతు నుంచి లోప‌లికి చొచ్చుకెళ్లి లోప‌లి భాగాల‌ను కొర‌క‌డం వ‌ల్లే ఆమె మృతి చెంది ఉంటుంద‌ని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు విచార‌ణ ప్రారంభించారు. కారు చోరీకి, బాధిత కుటుంబానికి ఎటువం‌టి సంబంధం లేద‌ని ప్రాథ‌మిక ద‌ర్యాప్తులో వెల్ల‌డైంది.

  • Loading...

More Telugu News