: కేసీఆర్ ప్రాజెక్టులన్నీ రొయ్యల కోసమే.. నాది ధర్మరాజు పాత్ర: జానారెడ్డి
శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు వింటుంటే... కేవలం రొయ్యలను పెంచడానికే ప్రాజెక్టులను కట్టిస్తున్నారనే అనుమానం కలుగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఎద్దేవా చేశారు. సభలో కొందరు మంత్రులు వాడుతున్న భాష సరిగా లేదని... చీటికీమాటికీ 'మా బిడ్డలు, మా కడుపులో పెట్టుకుంటాం' అంటున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన తీరును మార్చుకోవాలని సూచించారు. సభలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలమంతా పాండవుల మాదిరి ఎవరి పాత్రను వారు పోషిస్తున్నామని... తనది ధర్మరాజు పాత్ర అని చెప్పారు. కేవలం కాంగ్రెస్ పార్టీ వల్లే సభ హుందాగా కొనసాగుతోందని అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ జానారెడ్డి పైవ్యాఖ్యలు చేశారు.
గత పాలకుల లోపాల వల్లే విద్యుత్ కష్టాలు వచ్చాయని కేసీఆర్ అనడాన్ని జానారెడ్డి తప్పుబట్టారు. దేశంలోనే ఏ రాష్ట్రానికి దక్కనన్ని అవార్డ్ లు ఉమ్మడి ఏపీకి వచ్చాయని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ప్రాజెక్టులన్నీ కాంగ్రెస్ హయాంలో తెచ్చినవేనని... టీఆర్ఎస్ హయాంలో కొత్తగా వచ్చింది ఏమీ లేదని ఎద్దేవా చేశారు. భద్రాద్రి, యాదాద్రి ప్రాజెక్టులు 2022కు కూడా పూర్తి కావని అన్నారు.