: రికార్డులు తిరగరాసిన తిరుమలేశుడు!
తిరుమల వెంకన్న రికార్డులు తిరగరాశాడు. భక్తుల నుంచి వచ్చే కానుకల విషయంలో గతంలో ఎన్నడూ లేనంత ఎత్తునకు ఎదిగాడు. గడచిన 2016 శ్రీవారి హుండీ ఆదాయం రూ. 1000 కోట్లను దాటగా, ఇతరత్రా ఆదాయాలు మరో రూ. 400 కోట్లను దాటాయి. హుండీ ద్వారా రూ. 1019 కోట్ల ఆదాయం వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. ఇదే సమయంలో తలనీలల నుంచి తిరుమలలో షాపుల అద్దెలు తదితరాల వరకూ భారీగా ఆదాయం వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది.
ఇక గత రెండు నెలల్లో హుండీలో పడ్డ రద్దయిన నోట్లను బ్యాంకుల్లో జమ చేసుకుంటే వెంకన్న ఆదాయం మరింతగా పెరగనుంది. ఈ నోట్లను డిపాజిట్ చేసుకునే అవకాశం కల్పించాలని రిజర్వ్ బ్యాంకుకు లేఖ రాశామని, అందుకు ఇంకా సమాధానం రాలేదని టీటీడీ ఈఓ సాంబశివరావు మీడియాకు తెలిపారు. ఆర్బీఐ నుంచి సానుకూల సమాధానం వస్తుందని భావిస్తున్నామని, ఆపై పాత నోట్లను జమ చేస్తే, ఆదాయం మరింతగా పెరుగుతుందని ఆయన తెలిపారు. కాగా, 2015 సంవత్సరం వరకూ తిరుమల వెంకన్న ఆదాయం ఏ యేడూ రూ. 1000 కోట్లను దాటలేదు. గత సంవత్సరంలో వెంకన్న ఆదాయం రూ. 750 కోట్లు మాత్రమే!