: రాష్ట్ర వ్యాప్తంగా ఒంటరిగా నివసిస్తున్న మహిళలకు నెలకు రూ.1000 జీవనభృతి: సీఎం కేసీఆర్
ఒంటరిగా ఉన్న నిరుపేద మహిళలను ఆదుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. తెలంగాణలో చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ఈ రోజు శాసనసభలో ప్రసంగించిన కేసీఆర్... ఒంటరి మహిళలకు ప్రతి నెలా రూ.1000 జీవనభృతి ఇవ్వాలని తాము నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో సుమారు మూడు లక్షల మంది మహిళలు ఒంటరిగా వుంటున్నట్టు తాము అంచనా వేస్తున్నట్లు, వారి వివరాలపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను ఆదేశించనున్నట్లు తెలిపారు. తాము ఇప్పటికే పేదింటి ఆడపిల్లల కోసం కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టామని ఈ సందర్భంగా కేసీఆర్ గుర్తు చేశారు. రాష్ట్ర బడ్జెట్‌లో అధికభాగాన్ని సంక్షేమ పథకాలకే కేటాయించామని తెలిపారు.