: భారత్ లో వ్యాపారానికి దూరమైన ట్రంప్... రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు రద్దు
అమెరికాకు అధ్యక్షుడిగా బాధ్యతలు తీసుకోనున్న డొనాల్డ్ ట్రంప్ ఇండియాలో వ్యాపారాలకు దూరమయ్యారు. పలు దేశాల్లో నిర్మాణ రంగ ప్రాజెక్టుల్లో భాగంగా ఉన్న ఆయన కంపెనీలు, వీటిని వదులుకోవాలని నిర్ణయించుకున్నాయి. ఇండియాలోని పుణె, అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ లోని ప్రాజెక్టులు సహా, బ్రెజిల్, అజర్ బైజాన్, జార్జియా దేశాల్లోని హోటల్ లైసెన్సింగ్ ఒప్పందాలను సైతం ట్రంప్ ఆర్గనైజేషన్ రద్దు చేసుకుందని ట్రంప్ అటార్నీ అలాన్ గార్టెన్ వెల్లడించారు.
కాగా, ట్రంప్ భారత వ్యాపారాన్ని వదులుకోవడంపై ఆయన సంస్థలతో కలసి పనిచేస్తున్న పంచశీల్ రియాల్టీ స్పందించింది. ట్రంప్ ఆర్గనైజేషన్ సహకారంతో తాము చేపట్టాలని భావించిన రెండో ప్రాజెక్టు రద్దయిందని స్పష్టం చేసింది. అయితే ఈ నిర్ణయం దీర్ఘకాలం క్రితమే తీసుకున్నామని పేర్కొంది.
పుణెలో ఎవరూ రూ. 20 కోట్లతో ఫ్లాట్లు కొనేవారు లేరని పంచశీల్ రియాల్టీ చైర్మన్ అతుల్ చోరాడియా వ్యాఖ్యానించారు. కాగా, ఆగస్టు 2014లో పుణెలోని కల్యాణినగర్ ప్రాంతంలో ట్రంప్ టవర్స్ పేరిట 23 అంతస్తుల ప్రాజెక్టు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడది ఆగిపోయింది. ట్రంప్ గెలిచిన తరువాత అతుల్ తో పాటు, ట్రంప్ దీర్ఘకాల సహచరుడు కల్పేష్ మెహతా సైతం న్యూయార్క్ వెళ్లి ఆయన్ను అభినందించి వచ్చిన సంగతి తెలిసిందే.