: సెహ్వాగ్ స్పందించలేదు... ఎందుకు?
టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్సీకి మహేంద్ర సింగ్ ధోనీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియాలో భాగమైన ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో స్పందించారు. అయితే ట్విట్టర్ లో సూపర్ స్టార్ డమ్ సంపాదించుకున్న టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం స్పందించలేదు. సాధారణంగా సెహ్వాగ్ సమకాలీన అంశాలపైన, ప్రధానంగా క్రికెట్ తో సంబంధం ఉన్న ప్రతి అంశంపైనా సృజనాత్మకంగా స్పందిస్తాడు. అలాంటి సెహ్వాగ్, ధోనీని ఏమాత్రం పట్టించుకోలేదు.
కాగా, ప్రపంచ క్రికెట్ కు బ్యాటింగ్ లో దూకుడు నేర్పించిన సెహ్వాగ్ ను చివరి దశలో జట్టు నుంచి తప్పించడమే కాకుండా, పునరాగమనం కల్పించేందుకు కూడా ధోనీ సహకరించలేదని, దీంతో సెహ్వాగ్ రంజీ క్రికెటర్ స్థాయిలో క్రికెట్ కు వీడ్కోలు పలకాల్సి వచ్చిందన్న వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. కాగా, ధోనీ రాజీనామాపై స్పందించని సెహ్వాగ్... '8వ స్థానంలో వున్న టీమిండియాను వరల్డ్ నెంబర్ 2 జట్టుగా రూపుదిద్దింది గంగూలీ' అన్న ట్వీట్ ను రీట్వీట్ చేశాడు.
కాగా, సెహ్వాగ్ చెప్పినట్టు జట్టు ర్యాంకు 8వ స్థానంలో వున్న తరుణంలో బాధ్యతలు చేబట్టిన గంగూలీ, తన కెప్టెన్సీలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుని, దూకుడైన ఆటతీరుతో జట్టుగతిని మార్చి వరల్డ్ నెంబర్ 2 జట్టుగా తీర్చిదిద్దిన సంగతి తెలిసిందే. సెహ్వాగ్, యువరాజ్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్, ధోనీ వంటి వారికి అవకాశాలు కల్పించిన ఘనత గంగూలీదే కావడం విశేషం.