jarmany: మనుషులలా నడవద్దు: జర్మనీ వాసులకు డాక్టర్లు చెప్పిన ఓ వినూత్న ఐడియా
సీజన్ ప్రభావంతో కొన్ని అమెరికన్ దేశాలతో పాటు యూరప్‌లో దేశాల్లో కొన్ని నెలలపాటు విపరీతంగా మంచు కురుస్తుంది. అయితే, ఈ నేపథ్యంలో మంచుపై నడుస్తున్నప్పుడు మనుషులు జారి పడిపోయే అవకాశం ఉండడంతో దీనిపై ఓ వెబ్‌సైట్లో జర్మన్ సొసైటీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ అండ్ ట్రామా సర్జన్స్ ఆందోళన వ్యక్తం చేసింది. మూడేళ్ల క్రితం జర్మనీ వాసులు మంచుపై జారిపడడంతో ఏకంగా 750 ఎమర్జెన్సీ కేసులు నమోదయ్యాయని ఆందోళన తెలిపింది. అయితే, ఈ ప్రమాదం నుంచి జర్మనీ వాసులు తప్పించుకోవడానికి అక్కడి వైద్యులు ఓ వినూత్న ఐడియాను చెప్పారు. ఇకపై పౌరులు మనుషుల్లాగా నడవకూడదని, పెంగ్విన్స్ లా నడవాలని సూచించారు. లేదంటే ఇక భవిష్యత్తులో మనుషులు సమస్యల బారిన పడతారని జర్మనీ ప్రజలను హెచ్చరించారు.
వాతావరణ మార్పుల కారణంగా ఎల్లుండి నాటికి అక్కడి ఉష్ణోగ్రత మైనస్ 10 డిగ్రీలకు చేరుకుంటుందని అక్కడి వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 2014లో జరిగిన ఎమర్జెన్సీ కేసుల ఘటనలు మళ్లీ జరగకుండా ఉండాలంటే ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ తాము చెప్పినట్లు చేయాలని చెప్పారు. గతంలో అక్కడ పెరిగిపోయిన ఎమర్జెన్సీ కేసులకు బెర్లిన్ మునిసిపల్ అధికారుల నిర్లక్ష్యమే కారణమని అక్కడి ప్రజలు ఆరోపించారు. తమని పెంగ్విన్ పక్షుల్లా నడవాలని వైద్యులు చేసిన సూచన పట్ల అక్కడి ప్రజలు స్పందించారు. మనుషుల నడకకు, పెంగ్విన్‌ల నడకకు ఎంతో తేడా ఉంటుందని తెలిపారు. వాటిలా నడవడం మనుషులకెలా సాధ్యం అవుతుందని ప్రశ్నించారు. ఒకేసారి గెంతుతూ వెళ్లే పెంగ్విన్‌లలా నడవాలంటూ.. అడుగు తీసి అడుగు వేసే మనుషులకు సూచించడమేంటని అడుగుతున్నారు. అలా నడిచే ప్రయత్నంలో మనుషులు ఒక్క కాలు పట్టుతప్పినా పడిపోతారని చెప్పారు.