: తన రివాల్వర్ కనిపించడం లేదంటూ మాజీ ఎంపీ ఫిర్యాదు
కృష్ణా జిల్లా మచిలీపట్నం మాజీ ఎంపీ కేపీ రెడ్డయ్య యాదవ్ రివాల్వర్ తస్కరణకు గురైంది. ఈ మేరకు హైదరాబాద్ లోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆయన ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీ సమీపంలో ఉన్న శాలివాహన నగర్ లో రెడ్డయ్యయాదవ్ నివసిస్తున్నారు. గత నెల 5వ తేదీన మాజీ డిప్యూటీ స్పీకర్ బూరగడ్డ వేదవ్యాస్ కుమారుడి పెళ్లికి ఆయన హాజరయ్యారు. అనంతరం, ఆ రోజు రాత్రి పది గంటల సమయంలో ఇంటికి తిరిగి వెళ్తుండగా ఆయన ప్రమాదానికి గురవడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఈ నెల 2వ తేదీన ఆయన డిశ్చార్జి అయ్యారు. అయితే, ప్రమాదం జరిగిన రోజునే తన రివాల్వర్ కోసం వెతికినా కనిపించలేదని తెలుపుతూ, ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు.