: మినీ మహా సంగ్రామానికి ఎన్నికల సంఘం భారీ ఏర్పాట్లు.. వివరాలు వెల్లడించిన ఈసీ!
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ను ప్రకటిస్తూ, ఎన్నికల సంఘం కీలక అంశాలను వెల్లడించింది. ఓటర్ల జాబితా, చేస్తున్న ఏర్పాట్లు తదితరాలపై పలు విషయాలను వెల్లడించింది. ఈసీ మీడియా సమావేశం ముఖ్యాంశాలివి.
* పూర్తి పారదర్శకమైన ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
* గడచిన సంవత్సర కాలంగా ఈ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా కసరత్తు జరిపాం
* లక్షలాది తప్పులను, ఒకే ఓటర్ పలు చోట్ల నమోదు అయిన తప్పులనూ నివారించాం.
* తుది ఓటర్ల జాబితాలు గోవా, పంజాబ్ రాష్ట్రాల్లో 5న, ఉత్తరాఖండ్ లో 10న, ఉత్తరప్రదేశ్, మణిపూర్ రాష్ట్రాల్లో 12న విడుదలవుతాయి.
* మొత్తం 16 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
* దాదాపు 100 శాతం ఓటర్లకు గుర్తింపు కార్డులున్నాయి.
* కొత్తగా నమోదైన ఓటర్లకు ఎన్నికల లోపు కార్డులు ఇస్తాం.
* పోలింగ్ కేంద్రాలకు గుర్తింపు కార్డులు తీసుకెళ్లడం తప్పనిసరి.
* ఫోటోలతో కూడిన ఓటర్ల జాబితాను అందరికీ అందుబాటులో ఉంచుతాం.
* ప్రతి కుటుంబానికీ, ఆయా కుటుంబంలోని ఓటర్ల కలర్ ఫోటోలతో కూడిన జాబితాను అందిస్తాం.
* ఇందులోనే వారు ఓటు వేయాల్సిన పోలింగ్ స్టేషన్, ఎన్నికల తేదీ, సమయం వివరాలు కూడా ఉంటాయి.
* ఐదు రాష్ట్రాల్లో మొత్తం 1.85 లక్షల పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నాం.
* 2012 ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య 15 శాతం అధికం.
* అన్ని పోలింగ్ స్టేషన్లలో కనీస సౌకర్యాలు కల్పిస్తాం.
* ప్రతి పోలింగ్ స్టేషన్లో మహిళలకు ప్రత్యేక సౌకర్యాలు, భద్రత కల్పిస్తాం.
* ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, కేంద్ర, రాష్ట్ర బలగాలతో బందోబస్తు.