: 26 ఏళ్ల తరువాత నీట్లోంచి బయటపడ్డ గ్రామం!
నీటి లోంచి గ్రామం బయటపడడం ఏంటని అనుకుంటున్నారా? అయితే మీరు అర్జెంటీనాలోని ఈ గ్రామం గురించి తెలుసుకోవాల్సిందే! 1920లో లగో ఇపీక్యూయన అనే సరస్సు తీరంలో విల్లా ఇపీక్యూయన అనే గ్రామం పుట్టుకొచ్చింది. ఇది ఉప్పునీటి సరస్సు. ఇందులో స్నానం చేస్తే ఎటువంటి రోగమైనా నయమైపోతుందని బలమైన నమ్మకం ఉండేది. దీంతో ఇది ఒక ప్రసిద్ధ పర్యాటక ప్రాంతంగా మారిపోయింది.
దీంతో ఈ ప్రాంతం 1983 వరకు హోటళ్లు, ఇళ్లు, షాపులు, పార్కులు, మ్యూజియంతో కళకళలాడుతుండేది. ఈ సరస్సులో నీటిమట్టం ఏ ఏటికాయేడు పెరిగిపోతుండడంతో ఆ గ్రామ ప్రజలు అక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇది 1983లో నీటిలో మునిగిపోయింది. 2009లో నీరు తగ్గడంతో 26 ఏళ్ల తరువాత ఈ గ్రామం తిరిగి బయటపడింది. దీంతో గతంలో ఈ గ్రామంలో నివాసమున్న పబ్లోనోవక్ (81) అనే వ్యక్తిమాత్రం తన మూలాలు వెతుక్కుంటూ ఈ గ్రామానికి చేరుకున్నాడు. ప్రస్తుతానికి ఆయన ఇక్కడ నివాసం ఉంటున్నాడు.