: ఆకతాయిలను పోలీసులకు పట్టించిన క్రీడాకారిణి కృష్ణ పునియా!
భారత 'డిస్కస్ త్రో' క్రీడాకారిణి కృష్ణ పూనియా ఈవ్ టీజర్స్ ఆటకట్టించి నిజమైన హీరోగా నిలిచింది. రాజస్థాన్ లోని చిన్న పట్టణమైన చురులో రైల్వే క్రాసింగ్ వద్ద ఆమె కారు నిలపగా, అక్కడ ఇద్దరు యువతులను వేధిస్తున్న ముగ్గురు ఆకతాయిలు కనబడ్డారు. వెంటనే కారుదిగిన ఆమె పరారవుతున్న ముగ్గురినీ వెంబడించి, వారిలో ఒకరిని పట్టుకుని పోలీసులకు అప్పగించింది.
వారిని వేధించడం చూడగానే.. వారే తన కుమార్తెలైతే ఏం చేసేదాన్నని ఒక్కసారిగా ఆలోచన వచ్చిందని, దీంతో క్షణం కూడా ఆలస్యం చేయకుండా కిందకు దిగి వారి దగ్గరకెళ్లానని, తనను చూడగానే వారు పలాయనం చిత్తగించారని, అయినా వదలకుండా వెంటబడడంతో ఒక ఆకతాయిని పట్టుకోగలిగానని ఆమె చెప్పారు. అయితే వాడిని పట్టుకుని చాలాసేపు పోలీసుల కోసం ఎదురు చూడాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పోలీసులు ఆలస్యంగా స్పందిస్తే మహిళలకు రక్షణ ఎలా ఉంటుందని ప్రశ్నించింది. కాగా, కృష్ణ పునియా 2010 కామన్వెల్త్ గేమ్స్ లో డిస్కస్ త్రో విభాగంలో భారత్ కు గోల్డ్ మెడల్ అందించిన సంగతి తెలిసిందే.