: బీసీసీఐ పరువు పోయింది... ఆ పదవికి గంగూలీ సమర్థుడు!: సునీల్ గవాస్కర్
బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్, సెక్రటరీ అజయ్ షిర్కేలను పదవుల నుంచి తొలగిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన ఆదేశాలపై క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. గత కొన్ని నెలలుగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా బీసీసీఐ పరువు పోయిందని గవాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు అందరికీ శిరోధార్యమని... ప్రతి ఒక్కరూ కోర్టు ఆదేశాలను గౌరవించాల్సిందే అని చెప్పారు.
అనురాగ్ ఠాకూర్ స్థానాన్ని స్వీకరించడానికి సరైన వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు బదులిస్తూ... బీసీసీఐలో అత్యున్నత పదవులు చేపట్టడానికి స్ట్రాంగ్ బెంచ్ ఉందని, కానీ తన దృష్టిలో సౌరవ్ గంగూలీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరిస్తే బాగుంటుందనిపిస్తోందని చెప్పారు. 1999-2000 సంవత్సరాలలో టీమిండియాను మ్యాచ్ ఫిక్సింగ్ భూతం పట్టి పీడిస్తున్న సమయంలో సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ బాధ్యతలను స్వీకరించాడని... ఆ తర్వాత జట్టు ముఖచిత్రాన్నే తను మార్చేశాడని గవాస్కర్ కితాబిచ్చారు.