: ఆంధ్రా నేతలను చూసైనా నేర్చుకోండి.. ప్రతిపక్షాలకు తెలంగాణ మంత్రి లక్ష్మారెడ్డి హితవు
తమ రాష్ట్ర ప్రతిపక్ష నేతలకు తెలంగాణ మంత్రి డాక్టర్ లక్ష్మారెడ్డి క్లాస్ తీసుకున్నారు. ఆంధ్రా నాయకులను చూసి నేర్చుకోవాలని చురకలంటించారు. ప్రభుత్వం ఏ పథకం చేపట్టినా దానికి అడ్డుగా నిలవడం, విమర్శించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని విమర్శించిన మంత్రి ఈ విషయంలో ఆంధ్రా నేతలను చూసి ప్రతిపక్షాలు నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు.
మహబూబ్‌నగర్ జిల్లా నవాబ్‌పేటలో సోమవారం మంత్రి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆంధ్రా నాయకులు ఎంతో ఐక్యతతో ఉంటారని తెలిపారు. ఆంధ్రాలో పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ముమ్మరంగా సాగుతుంటే, తెలంగాణలో ప్రతిపక్ష నాయకుల పుణ్యమా అని పాలమూరు ఎత్తిపోతల పథకం ఆగిపోతోందన్నారు. ప్రాజెక్టులు కట్టొద్దంటూ జిల్లాకు చెందిన కొందరు సన్నాసులు కోర్టుకు వెళ్లి స్టేలు తెచ్చుకుంటున్నారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని నాగం జనార్దన్‌రెడ్డి కోర్టుకు వెళ్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పథకాలు బాగాలేవంటూ జేఏసీ నాయకులు ప్రతిపక్షాలకు వంత పాడడం సరికాదని అన్నారు..