: జైల్లో డ్రగ్ గ్యాంగ్ ల మధ్య ఘర్షణ... 60 మంది ఖైదీల మృతి
బ్రెజిల్ లోని ఓ జైలులో చోటు చేసుకున్న ఘర్షణ పెను విషాదానికి దారి తీసింది. మనాస్ లోని అమెజాన్ జంగిల్ నగరంలో గల జైలులో రెండు డ్రగ్ గ్యాంగ్ ల మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చిలికిచిలికి గాలివానగా మారింది. దీంతో రెండు వర్గాలు దాడులకు తెగబడ్డాయి. ఈ దాడులు ఏ స్థాయిలో జరిగాయంటే... ప్రత్యర్థులను హత్యచేసి, జైలు గోడల ఆవలికి విసిరేయడం జరిగింది.
ఈ సందర్భంగా కొంతమంది ఖైదీలు తప్పించుకుని వెళ్లిపోవడం విశేషం. ప్రస్తుతానికి ఈ ఘటనలో మృతిచెందిన ఖైదీల సంఖ్య 60కి చేరుకుందని, ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అమెజాన్ భద్రతా అధికారి తెలిపారు. ఈ ఘటనతో వెంటనే రంగంలోకి దిగిన అధికారులు అతి కష్టంమీద శాంతియుత వాతావరణం నెలకొల్పినట్టు ఆయన చెప్పారు. కాగా, బ్రెజిల్ జైళ్లలో ఖైదీలు కిక్కిరిసి ఉంటారని, తరచు గొడవలు జరుగుతుంటాయని అంతర్జాతీయ స్థాయిలో విమర్శలు వెలువడుతున్న సంగతి తెలిసిందే.