: భార్యపై కోపంతో 11 మందిని కిరాతకంగా కాల్చి చంపాడు!
మనస్పర్థలతో తన నుంచి విడిపోయిన భార్యపై కోపంతో రగిలిపోతున్న ఓ వ్యక్తి రక్తపాతం సృష్టించాడు. కొత్త సంవత్సర వేడుకల సమయంలో అందరూ ఆనందంగా గడుపుతున్న సమయంలో... తన భార్య, ఎనిమిదేళ్ల కుమారుడు సహా 11 మందిని అత్యంత కిరాతకంగా కాల్చి చంపాడు. ఈ ఘటన బ్రెజిల్ లోని కాంపినస్ సిటీలో జరిగింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే, సిడ్నే రమిస్ డి అరజో (46) ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితమే అతడిని భార్య వదిలేసింది. తన కుమారుడిని కూడా తీసుకుని, వేరే ఇంట్లో ఉంటోంది. దీంతో, ఆమెపై కక్ష పెంచుకున్న సిడ్నే రమిస్ భార్యను అంతమొందించాలనే నిర్ణయానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఓ పథకం ప్రకారం తుపాకి, కత్తి, పేలుడు పదార్థాలతో ఆమె ఇంటికి వెళ్లాడు. న్యూ ఇయర్ వేడుకలు జరుగుతుండగా, గోడ దూకి ఇంట్లోకి వెళ్లిన ఆ కిరాతకుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో భార్య, కొడుకు సహా 11 మంది అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆ తర్వాత తనను తాను కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.