: ఆ కళ్లద్దాలు పెట్టుకుంటే సీసీ కెమెరాల్లో ముఖం కనిపించదు!
అత్యాధునిక టెక్నాలజీని నేరగాళ్లు కూడా తమకు అనుగుణంగా ఉపయోగించుకుంటున్న ఘటనలు ప్రతిరోజు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కాలంలో నేరగాళ్లను పట్టించే క్రమంలో నిఘా నేత్రాలు ఎంతగానో సహకరిస్తున్నాయన్న విషయం తెలిసిందే. అయితే, వాటి కంట పడినా ఎవ్వరూ గుర్తించకుండా ఉండేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ఓ రకపు కళ్లద్దాలని దొంగలు ఉపయోగిస్తారేమోనన్న భయం నెటిజన్లలో పట్టుకుంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రిఫ్లెక్టివ్ కళ్లద్దాలు పెట్టుకుంటే సీసీ కెమెరాలలో ముఖాలు కనిపించవు. ‘రిఫ్లెక్టకల్స్’ గా పిలిచే ఈ కళ్లద్దాలు కాంతిని ప్రతిబింబింపజేసి మెరుస్తాయి. దీంతో అవి పెట్టుకున్న వారి ముఖాలు సీసీ కెమెరాల్లో కనిపించవు.
వీటిని చీకట్లో రోడ్లు కనపడడానికి సైకిలిస్టులు, జాగింగ్ చేసేవారి కోసం చికాగోకు చెందిన స్కాట్ ఉర్బన్ తయారు చేసింది. మైక్రో-ప్రిస్మాటిక్ రెట్రో-రిఫ్లెక్టివ్ పదార్థాలు ఉపయోగించి దీన్ని రూపొందించారు. అయితే, ఈ కళ్లద్దాలు సీసీ కెమెరాల్లో మెరుస్తూ కనిపించి వారి ముఖం కనిపించకుండా చేస్తాయి. దీంతో నేరగాళ్లు వీటిని వాడే ప్రమాదం ఉందని సోషల్ మీడియాలో నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తూ పోస్టులు చేస్తున్నారు.