: ఆ సమయంలో విదేశాల్లో వున్న భారతీయులు ఎంతైనా... ఎన్నారైలు మాత్రం రూ. 25 వేల వరకూ... పాత నోట్ల మార్పిడికి జూన్ 30 వరకూ చాన్సిచ్చిన ఆర్బీఐ!
విదేశాల్లో ఉంటున్న భారతీయులు పాత నోట్లను మార్చుకునే గడువును పొడిగిస్తూ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శనివారం రాత్రి ఉత్తర్వులను వెలువరించింది. వీరికి జూన్ 30 వరకూ గడువిచ్చింది. నోట్ల రద్దు ప్రకటించిన నవంబర్ 9 నుంచి గడువు ముగిసిన డిసెంబర్ 30 వరకూ విదేశాల్లో ఉన్న వారు ఈ అవకాశాన్ని వాడుకోవచ్చు. ఇందులో భాగంగా విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులు (రెసిడెంట్ ఇండియన్స్) ఎంత మొత్తంలోనైనా నగదును మార్చుకోవచ్చు. అర్హులైన భారత పౌరులకు పరిమితులు లేవని, ఎన్నారై (నాన్ రెసిడెంట్ ఇండియన్స్) కు మాత్రం ఫెమా చట్టం వర్తిస్తుందని ఆర్బీఐ తెలిపింది.
ఫెమా నిబంధనల ప్రకారం రూ. 25 వేల వరకూ నగదును మార్చుకోవచ్చు. వీరంతా గుర్తింపు డాక్యుమెంట్లతో పాటు, నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకూ విదేశాల్లో ఉన్నట్టు, తమ ఖాతాల్లో డబ్బు జమ చేసుకోలేదన్న ఆధారాలను చూపించాల్సి వుంటుంది. వీరంతా స్వయంగా బ్యాంకులకు వచ్చి డబ్బును డిపాజిట్ చేసుకోవచ్చని, థర్డ్ పార్టీ వ్యక్తులను అనుమతించబోమని ఆర్బీఐ వెల్లడించింది.