: నూతన సంవత్సరం వేళ మోదీ ప్రకటించిన వరాలివి!

కొత్త సంవత్సరంలో బ్యాంకింగ్‌ వ్యవస్థను తిరిగి సాధారణ స్థితికి సాధ్యమైనంత త్వరగా తీసుకువస్తామని హామీ ఇస్తూ, ప్రధాని నరేంద్ర మోదీ భారత ప్రజలకు పలు వరాలను ప్రకటించారు. పదేళ్ల కాలపరిమితితో వయో వృద్ధులు చేసే రూ. 7.5 లక్షల లోపు ఫిక్సెడ్ డిపాజిట్లపై 8 శాతం వార్షిక వడ్డీ ఇస్తామని తెలిపారు. పల్లె ప్రాంతాల్లోని గర్భిణీలు, బాలింతరాళ్ల ఆరోగ్య ఖర్చులను ప్రభుత్వం భరిస్తుందని, అందు నిమిత్తం వారి బ్యాంకు ఖాతాల్లో నేరుగా రూ. 6 వేలు జమచేస్తామని తెలిపారు.

రబీ కోసం జిల్లా కో-ఆపరేటివ్ బ్యాంకులు, సొసైటీల ద్వారా తీసుకునే రుణాలపై 60 రోజుల వరకు వడ్డీ మాఫీ చేస్తామని వెల్లడించారు. గ్రామీణ ప్రాంతాల్లో గృహ నిర్మాణం నిమిత్తం తీసుకున్న అప్పుల్లో రూ.2 లక్షల వరకు 3 శాతం వడ్డీ మాఫీ చేస్తామని, కొత్త సంవత్సరంలో ఇంటి నిర్మాణం నిమిత్తం తీసుకునే రూ. 9 లక్షల రుణానికి 4 శాతం వడ్డీ, రూ. 12 లక్షల వరకు రుణానికి 3 శాతం మేరకు వడ్డీ రేట్లను తగ్గించనున్నామని ప్రకటించారు.

మూడు కోట్ల మంది రైతుల కిసాన్ క్రెడిట్ కార్డులను రూపే కార్డులుగా మార్చనున్నట్టు తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రూ. 1 కోటి నుంచి రూ. 2 కోట్లకు రుణ లభ్యతను సవరిస్తున్నామని పేర్కొన్నారు. నాబార్డు మూలనిధిని రూ. 41 వేల కోట్లకు పెంచుతామని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ముద్ర యోజన ద్వారా ప్రస్తుతం లబ్ధి పొందుతున్న 3.5 కోట్ల సంఖ్యను రెట్టింపు చేస్తామని, కొత్తగా చేరే జాబితాలో ఎస్సీ, ఎస్టీలు, మహిళలు, వెనుకబడిన తరగతుల ప్రజలకు ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు.

More Telugu News