: ఒంటి గంట కాదు, రెండు గంటల వరకూ సంబరాలకు అనుమతి... అతి చేస్తే మాత్రం అంతే సంగతులు!
కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ జరుపుకునే వేడుకల్లో అతిగా ప్రవర్తిస్తే, జైలుకు వెళ్లాల్సి వుంటుందని పోలీసు అధికారులు హెచ్చరించారు. హైదరాబాద్ లో ప్రతి సంవత్సరంలానే రాత్రి ఒంటిగంట వరకూ కాకుండా, రెండు గంటల వరకూ సెలబ్రేషన్స్ కు అనుమతి ఇస్తున్నామని, యథావిధిగా అన్ని ఫ్లయ్ ఓవర్లనూ మూసివేస్తున్నామని తెలిపారు. నగరంలోని అన్ని సీసీ కెమెరాల ద్వారా నిఘా కొనసాగుతుందని, కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పరిస్థితిని పర్యవేక్షిస్తుంటామని తెలిపారు.
అనుమతి లేకుండా పార్టీలు ఏర్పాటు చేసినా, ప్రజలకు ఇబ్బందులు కలిగించినా, మద్యం సేవించి రహదారులపై ప్రయాణించినా కఠినచర్యలు ఉంటాయని తెలిపారు. లైసెన్సులు, సరైన ధ్రువపత్రాలు లేకుండా వాహనాలు నడుపరాదని, పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని సూచించారు. కాగా, దాదాపు ఇదే విధమైన ఆంక్షలు విజయవాడ, విశాఖపట్నం తదితర నగరాల్లోనూ కొనసాగనున్నాయి.