: అరుణాచల్ ప్రదేశ్ రాజకీయ సంక్షోభం: ఇప్పటికీ పెమా ఖండూనే సీఎంగా భావిస్తున్నామన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూతో పాటు ఏడుగురు నేతలపై పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. పీపీఏ నుంచి సస్పెన్షన్ కు గురైన పెమా ఖండూకు బీజేపీ బాసటగా నిలిచి, ఆయనకు మద్దతుగా వ్యాఖ్యలు చేసింది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు తాపిర్ గయో ఈ అంశంపై స్పందిస్తూ... పెమా ఖండూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని, ఇప్పటికీ ఆయననే సీఎంగా భావిస్తున్నామని అన్నారు.
జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ స్పందిస్తూ... బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలు పెమా ఖండూ నాయకత్వాన్నే కోరుకుంటున్నారని చెప్పారు. పీపీఏ అధ్యక్షుడు ఖాఫా బెంజియా మాత్రం తమ నిర్ణయంపై వెనక్కి తగ్గడం లేదు. రాష్ట్ర సర్కారుకి, తమ పార్టీకి మధ్య సమన్వయం సాధించడంలో పెమా ఖండూ విఫలమయ్యారని మండిపడ్డారు. మరోవైపు పెమా ఖండూ స్థానంలో ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి ముగ్గురు పీపీఏ నేతలు పోటీలో ఉన్నారని తెలుస్తోంది. ఖండూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తారా? అనే అంశంపైనే అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ మొదలయింది.