: చైనాను ఎండగట్టాలనే భారత్ వ్యూహం ఫలిస్తుందా?


చైనాను అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టేందుకు భారత్ సమాయత్తమవుతోంది. వివరాల్లోకి వెళ్తే, జైష్-ఏ-మహమ్మద్ ను ఉగ్రవాద సంస్థగా గుర్తించి, దాని చీఫ్ మౌలానా మసూద్ అజార్ ను దోషిగా నిలబెట్టాలని ఈ ఏడాది మార్చి 31న ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో భారత్ తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఐదు శాశ్వత సభ్య దేశాలు, పది తాత్కాలిక సభ్య దేశాలు ఉన్న మండలిలో భారత్ తీర్మానాన్ని అన్ని దేశాలూ సమర్థించాయి. కానీ, చైనా మాత్రం అడ్డుకుంది.

ఈ నేపథ్యంలో, పఠాన్ కోట్ పై ఉగ్రదాడికి సంబంధించి ఎన్ఐఏ పలు ఆధారాలు సేకరించింది. జైష్-ఏ-మహమ్మద్ సంస్థే ఈ ఉగ్రదాడికి పాల్పడిందనే పక్కా ఆధారాలను సేకరించింది. దీంతో, ఈ ఆధారాలను మరోసారి ఐక్యరాజ్యసమితి దృష్టికి తీసుకెళ్లేందుకు భారత్ సిద్ధమవుతోంది. ఎన్ఐఏ ఆధారాల నేపథ్యంలో, ఈ సారి భారత్ తీర్మానాన్ని చైనా కచ్చితంగా ఆమోదించి తీరాల్సి ఉంటుంది.

ఒకవేళ ఈసారి కూడా చైనా వ్యతిరేకిస్తే... చైనా ద్వంద్వ నీతిని అంతర్జాతీయ సమాజం ముందు ఎండగట్టాలనేది భారత్ వ్యూహం. అంతేకాదు, చైనాతో సంబంధాల విషయంలో కూడా భారత్ కొంచెం దూరం జరిగే అవకాశం ఉంటుంది. భారత్ కు వ్యతిరేకంగా పాకిస్థాన్ కు చైనా ఎప్పట్నుంచో సహాయ సహకారాలు అందిస్తున్న సంగతి తెలిసిందే. తన వ్యాపార అవసరాల కోసం పాకిస్థాన్ కు అండగా ఉంటోంది చైనా. 

  • Loading...

More Telugu News