: పేద కుటుంబంలో పుట్టి ఈ స్థాయికి వచ్చాను... నిజాయతీగా ఉన్నాను!: తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు
పేద కుటుంబంలో పుట్టి తానీ స్థాయికి వచ్చానని తమిళనాడు మాజీ చీఫ్ సెక్రటరీ రామ్మోహన్ రావు తెలిపారు. ఓ తెలుగు టీవీ ఛానెల్ తో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం కాని రాష్ట్రంలో పని చేస్తున్నామని, తప్పులకు తావివ్వకూడదని నిజయతీగా పని చేస్తున్నానని అన్నారు. జయలలిత లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆయన చెప్పారు. తానేంటో తమిళనాడులోని అన్ని రాజకీయ పార్టీలకు తెలుసని ఆయన చెప్పారు. ఈ సంఘటన జరిగిన అనంతరం తనకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడులోని తెలుగు వారు కూడా పెద్దఎత్తున ఫోన్ చేసి, సానుభూతి తెలిపారని, వారందరికీ ధన్యవాదాలని ఆయన అన్నారు. కుట్రపూరితంగా తనపై లేనిపోని అభియోగాలు మోపారని ఆయన తెలిపారు. దీనిని తట్టుకోలేక ఆవేశంతో తన ఆక్రోశం వెళ్లగక్కానని ఆయన చెప్పారు. శేఖర్ రెడ్డితో తనకు సంబంధాలు లేవని ఆయన స్పష్టం చేశారు.