: దొంగలకు సహకరిస్తున్న కానిస్టేబుల్ వీడియో వైరల్... మీరూ చూడండి!


ప్రజలను రక్షించాల్సిన బాధ్యతాయుతమైన పోలీసు ఉద్యోగంలో ఉండీ దొంగలకు సహకరిస్తూ, సీసీ కెమెరాలకు చిక్కి నెట్టింట తిట్టించుకుంటున్నాడో హెడ్ కానిస్టేబుల్. కొందరు మహిళా దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి భారీ ఎత్తున నగలను స్వాధీనం చేసుకున్న తరువాత, వారిని విచారించగా, ఈ పోలీసు నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలోని చావ్రీ బజార్ మెట్రో స్టేషన్ సీసీ కెమెరాల్లో ఈ వైనం నిక్షిప్తమైంది కూడా. మహిళా దొంగ నుంచి ముడుపులు స్వీకరించిన ఈ పోలీసు దాన్ని ఎంచక్కగా జేబులో దోపుకుంటున్నాడు.

అమెరికా నుంచి వచ్చిన ఓ మహిళ గుర్గావ్ వెళుతూ, తన నగలను పోగొట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. అంతకుముందు తాను మెట్రో స్టేషన్లో తీసుకున్న సెల్ఫీలను పోలీసులకు చూపగా, అందులో మహిళా దొంగలు కూడా కనిపించడంతో, ఈ గ్యాంగును పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితురాలి నుంచి దొంగిలించిన నగలనే ఆ మహిళా దొంగ పోలీసుకు ఇచ్చినట్టు కూడా విచారణలో వెల్లడైంది. సదరు కానిస్టేబుల్ ను గుర్తించి సస్పెండ్ చేశామని, పూర్తి విచారణ జరుగుతోందని, ఆరుగురు మహిళా జేబుదొంగలను అరెస్ట్ చేసి రూ. 22 లక్షల విలువైన నగలను స్వాధీనం చేసుకున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. మెట్రో స్టేషన్ లో రికార్డయిన సీసీటీవీ దృశ్యాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News