: నిన్న తెలుగు రాష్ట్రాల మధ్య రవాణా లొల్లి... నేడు తనిఖీలతో ఉక్కుపాదం మోపిన తెలంగాణ
నిన్న ఖైరతాబాద్ లోని ఆర్టీయే కార్యాలయం వేదికగా, టీఆర్ఎస్ ఎమ్మెల్యే శ్రీనివాసగౌడ్, తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిల మధ్య రవాణా లొల్లి ఎంత ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిందో అందరికీ తెలిసిందే. ఇద్దరు నేతలూ సవాళ్లు, ప్రతిసవాళ్లూ విసురుకుని, చర్చలకంటూ కదిలేసరికి, వారిని నిలువరించేందుకు పోలీసులు నానా తంటాలూ పడాల్సి వచ్చింది. ఆరోపణలు, ప్రత్యారోపణలతో మాకు అన్యాయం జరుగుతోందంటే, మాకు అన్యాయం జరుగుతోందని ఇరు పక్షాలూ వాదించాయి.
ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే తెలంగాణ ఆర్టీయే అధికారులు కొరడా తీశారు. తెల్లవారుఝామునే హైదరాబాద్ కు వచ్చే పలు ప్రధాన మార్గాల్లో మోహరించి, ప్రైవేటు బస్సులను తనిఖీలు చేశారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ వద్ద నిర్వహించిన తనిఖీల్లో 13 ప్రైవేటు బస్సులను సీజ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్నాయంటూ, విజయవాడ హైవేపై జరిగిన తనిఖీల్లో 7 బస్సులపై కేసులు నమోదు చేశారు. తమను తెలంగాణలో వేధిస్తున్నారని దివాకర్ ట్రావెల్స్ యజమాని జేసీ ప్రభాకర్ రెడ్డి విమర్శించిన తరువాత ఒక్క రోజు కూడా గడవకముందే తనిఖీలు జరగడం గమనార్హం.