: చైనాలో ఇకపై కొత్త రకం పన్ను
ప్రపంచంలోని బలమైన ఆర్థిక వ్యవస్థల్లో అమెరికా తర్వాతి స్థానం చైనాదే. అయితే, ఇదే సమయంలో విపరీతమైన పారిశ్రామికీకరణ నేపథ్యంలో, చైనా కాలుష్య కోరల్లో చిక్కుకుంది. ప్రపంచ దేశాల్లో అత్యధికంగా గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేస్తున్న దేశాల జాబితాలో చైనా తొలి స్థానంలో ఉంది. దీంతో, పర్యావరణాన్ని పరిరక్షించుకునేందుకు చైనా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కాలుష్యానికి చెక్ పెట్టేందుకు పర్యావరణ పన్నును ప్రవేశపెట్టనుంది. 'పర్యావరణ పన్ను చట్టం' కింద కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలపై భారీగా పన్ను విధించబోతోంది. 2018 జనవరి 1వ తేదీ నుంచి ఈ పన్ను అమల్లోకి రానుంది. నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ చట్టం కింద కాలుష్య కారకాలన్నింటికీ ఓ నిర్దిష్ట పరిమితిని విధిస్తూ, ఓ జాబితాను రూపొందించారు. ఈ పరిమితిని దాటి, కాలుష్యాన్ని వెదజల్లే పరిశ్రమలకు భారీగా పన్ను విధించనున్నారు.