: ప్రజలు నిన్ను ఏ చౌరస్తాలో శిక్షించాలో నువ్వే నిర్ణయించుకో!: మోదీకి లాలూ సూచన
పెద్దనోట్ల రద్దు సందర్భంగా ప్రధాని కోరిన 50 రోజుల గడువు పూర్తయిందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తెలిపారు. పాట్నాలో ఆయన మాట్లాడుతూ, నల్లధనాన్ని అరికట్టేందుకే పెద్ద నోట్లను రద్దు చేస్తున్నామని అన్నారని గుర్తుచేశారు. 50 రోజుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలన్నీ తొలగిపోతాయన్నారని ఆయన గుర్తుచేశారు. మోదీ ఇచ్చిన గడువు ముగిసిందని ఆయన చెప్పారు.
దీంతో ప్రజలు ఆయనను శిక్షించే సమయం ఆసన్నమైందని లాలూ చెప్పారు. మోదీని ఏ చౌరస్తాలో శిక్షించాలో ఆయనే నిర్ణయించుకోవాలని అన్నారు. మోదీ బహిరంగ సభల్లో తొలి వరుసలో కూర్చునే ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ‘మోదీ.. మోదీ’ నినాదాలు చేయడాన్ని దేశ ప్రజల అభిప్రాయంగా పొరపడవద్దని ఆయన హితవు పలికారు. ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే బీజేపీ ఓటమిపాలవుతుందని, యూపీ ఎన్నికల్లో ఆ పార్టీ అడ్రస్ గల్లంతవుతుందని ఆయన జోస్యం చెప్పారు.