: ఈ సినిమా అందరికీ చిరకాలం గుర్తుంటుంది!: బాలకృష్ణ
తెలుగు రాజహంస గౌతమీపుత్ర శాతకర్ణి అని ప్రముఖ నటుడు బాలకృష్ణ తెలిపారు. గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో వేడుకలో ఆయన మాట్లాడుతూ, భారత దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా పాలించిన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి అని అన్నారు. కరీంనగర్ జిల్లా కోటిలింగాలలో ఆయన జన్మించారని అన్నారు. దౌర్భాగ్యం ఏంటంటే అలాంటి తెలుగు వ్యక్తి గురించి మనకు సరిగ్గా తెలియకపోవడం దారుణమని అన్నారు. నటుల నుంచి అద్భుతమైన నటన రాబట్టే సామర్థ్యమున్న వ్యక్తి క్రిష్ అన్నారు. వందో సినిమా కోసం చాలా కథలు విని అంగీకరించని దశలో ఆయన కథ చెప్పడం, ఆ కధను తాను అంగీకరించడం జరిగిందని అన్నారు.
ఈ సినిమా అందరికీ చిరకాలం గుర్తుంటుందని ఆయన అన్నారు. సినిమా అంటే వినోదం మాత్రమే కాదని, తెలుసుకోవాల్సిన గొప్ప విషయమని ఈ సినిమా ద్వారా నిరూపితమవుతుందని ఆయన చెప్పారు. తన తల్లి దీవెనల వల్లే నటసింహం అని, ఎమ్మెల్యే అని పిలిపించుకుంటున్నానని అన్నారు. ఎంతో గొప్ప చరిత్ర కలిగిన జాతి మన తెలుగు జాతి అని బాలకృష్ణ తెలిపారు.