: జనాలు ఎన్నుకుంటేనే సభలో ఉన్నా... ఎవరి దయాదాక్షిణ్యాలమీద కాదు: కేటీఆర్

తెలంగాణ అసెంబ్లీలో మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డిల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇటీవలే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్న ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మాట్లాడుతుండగా... ఏ పార్టీ తరపున ఆయన మాట్లాడుతున్నారో చెప్పాలని కాంగ్రెస్ నేతలు ప్రశ్నించారు. దీనికి సమాధానంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారో (ఫిరాయింపుల విషయంలో) గుర్తు తెచ్చుకోండని అన్నారు. సభలో స్పీకర్ దే తుది నిర్ణయమని చెప్పారు.

 దీంతో జానారెడ్డి సీరియస్ అయ్యారు. విపక్షాలను రెచ్చగొట్టే రీతిలో మంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కేటీఆర్ మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ప్రభుత్వ చర్యలను తాము ఖండిస్తున్నామని చెప్పారు. దీంతో కేటీఆర్ కూడా ఘాటుగా స్పందించారు. తన మాట వినాల్సిన అవసరం లేదని జానారెడ్డి అనడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానని చెప్పారు. తాను ఎవరి దయాదాక్షిణ్యాలపై మంత్రి కాలేదని... ప్రజలు ఎన్నుకుంటేనే ఇక్కడ ఉన్నానని అన్నారు. జానారెడ్డిని వ్యక్తిగతంగా తాను విమర్శించలేదని... గత ప్రభుత్వ హయాంలో జరిగిన వాటినే తాను లేవనెత్తానని చెప్పారు. 

More Telugu News