: క్రిస్మస్ పండుగ ఆనందాన్ని దూరం చేసిన నీటి కొరత.. చుక్క నీటి కోసం అల్లాడిపోయిన లండన్ వాసులు
క్రిస్మస్ పర్వదినం వేళ లండన్ వాసులు నీటి కొరతతో అల్లాడిపోయారు. చుక్కనీటి కోసం అష్టకష్టాలు పడ్డారు. ఫలితంగా పండగ సంబరం ఆవిరైంది. నీటిని సరఫరా చేసిన కంపెనీలు కూడా చేతులెత్తేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఎదుర్కొన్నారు. కాలకృత్యాలు తీర్చుకునేందుకు కూడా నీళ్లు లేకుండా పోయాయంటూ ట్విట్టర్ ద్వారా లండన్ ప్రజలు తమ నిరసనను పెద్ద ఎత్తున తెలియజేశారు. లండన్లోని చాలా ప్రాంతాలు నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్నాయని పేర్కొన్నారు. నీటి సమస్య కారణంగా క్రిస్మస్ పర్వదినాన్ని ఎంజాయ్ చేయలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే నీటి సరఫరాలో సమస్యలున్న వార్త వాస్తవమేనని, త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు కోరారు.